చెన్నై: తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. లండన్ వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పిన విజయ్.. తన స్నేహితుడు, మోటార్ స్పోర్ట్స్ రేసర్ అజిత్ కుమార్ కార్ రేసు చూడటానికే వెళ్లారని డీఎంకే నేతలు ఎద్దేవా చేశారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో ఆదివారం జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసుకు త్రిషతో కలిసి విజయ్ హాజరయ్యారు. 2026 చాంపియన్‌షిప్‌లో భాగంగా ఐదో రౌండ్ రేసులో అజిత్ పాల్గొన్నారు. రేసు ప్రారంభానికి ముందు విజయ్ ఉత్సాహంగా అజిత్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఎం పెట్టుబడుల కోసం వెళ్లలేదు..
విజయ్ పెట్టుబడుల కోసం లండన్ వెళ్లలేదని, అజిత్ కార్ రేసు చూడటానికి వెళ్లారని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, మత్స్యకారులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఇతర అనేక సమస్యలు ఉన్నాయని డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ ఆరోపించారు. డీఎంకే విమర్శలను టీవీకే అధికార ప్రతినిధి అమెరికై వి.నారాయణన్ తిప్పికొట్టారు. పర్యటనలో భాగంగా స్నేహితుడిని కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. అజిత్‌ను సీఎం విజయ్ కలవడం వల్ల తమిళనాడుకు మరింత విలువ వస్తుందన్నారు.
మోటార్ స్పోర్ట్స్ సిటీపై ఫోకస్
తమిళనాడులో ఇప్పటికే ఉన్న ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాన్ని మరింత విస్తరించేలా ప్రపంచస్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మోటార్ స్పోర్ట్స్ మౌలిక వసతులు, స్పోర్ట్స్ టూరిజం, ఆటోమొబైల్ రంగానికి అనుబంధ ప్రత్యేక పరిశ్రమల అవకాశాలను పరిశీలించేందుకు విజయ్ పర్యటన ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
